మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కొద్దీ రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఇందిరాదేవి.. హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఆమె ఆరోగ్యం విషమించడంతో క‌న్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు కూతుళ్లు..ఇద్ద‌రు కొడుకులు. ప‌ద్మ‌, మంజుల‌, ఇందిరా ప్రియ‌ద‌ర్శిని. ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు. ఇందిరాదేవి మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ ని శోకసంద్రంలో పడేసింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయనేతలు ఇందిరాదేవికి నివాళ్లు అర్పించారు.

బుధువారం సాయంత్రం జూబ్లీహిల్స్‏లోని మహా ప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి మహేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబసభ్యులతోపాటు.. సినీ ప్రముఖులు..అభిమానులు పాల్గొన్నారు. ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.