మరిన్ని సడలింపులు ప్రకటించిన మహారాష్ట్ర

అన్ని రైళ్లు, బార్లు, హోటళ్లు, టూరిజం స్పాట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి

మరిన్ని సడలింపులు ప్రకటించిన మహారాష్ట్ర
Restaurants, bars in Maharashtra likely to open october-5

ముంబయి: కేంద్రం అన్‌ లాక్‌- 5 మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ప్రకటించింది. 5వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు తదితరాలను కస్టమర్ల సంఖ్యను నియంత్రణలో ఉంచుకుని పునః ప్రారంభించవచ్చని వెల్లడించింది. కస్టమర్ల సంఖ్య కెపాసిటీలో 50 శాతం మించరాదని ఆదేశించింది. రాష్ట్రంలోని గమ్య స్థానాలకు తిరిగే అన్ని రైళ్లకు కూడా అనుమతి ఇస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. టూరిజం ప్రాంతాలను కూడా తిరిగి తెరచుకోవచ్చని, అయితే, స్టాండర్డ్ కొవిడ్ ప్రొటోకాల్ అమలు తప్పనిసరని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ పర్యాటక కేంద్రాలను తెరవవచ్చని పేర్కొంది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ లోని అన్ని పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు తెరచుకోవచ్చని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎంఎంఆర్, పుణె రీజియన్ లో స్థానిక రైళ్ల సంఖ్యను మరింతగా పెంచుకున్నామని, లోకల్ రైళ్ల ద్వారా డబ్బావాలాలు తమ సేవలను తిరిగి ప్రారంభించ వచ్చని కూడా తెలిపింది. వారి కోసం ప్రత్యేక పాస్ లను ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయం జారీ చేస్తుందని వెల్లడించింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టెయిన్ మెంట్ పార్కులు, మాల్స్ లోని థియేటర్లు, మార్కెట్ ప్లేస్ లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ ప్రస్తుతానికి మూసే ఉంచాలని, వీటి విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/