థాకరే ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది

Devendra Fadnavis
Devendra Fadnavis

ముంబయి: మహారాష్ట్రలో ఉద్దవ్‌ థాకరే ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ సిఎం, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ జోస్యం చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి బిజెపి ఏమీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీహార్ లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. మహారాష్ట్రలోని ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని… ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఫడ్నవిస్ అన్నారు.

ఈ ప్రభుత్వం కూలిపోతే… తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన తమకు లేదని అన్నారు. మహారాష్ట్రలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులకు కనీస ఆర్థిక సాయాన్ని కూడా అందించడం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీగా రైతుల సమస్యలపై ప్రభుత్వంతో తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలతో పాటు, పశ్చిమబెంగాల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఫడ్నవిస్ అన్నారు. పశ్చిమబెంగాల్ లో మార్పును మనమంతా చూస్తామని చెప్పారు. పశ్చిమబెంగాల్ లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/