అక్కడ ఇకపై సూపర్ మార్కెట్లులోనూ మద్యం అమ్మకాలు

లైసెన్స్ కింద రూ. 5 వేలు చెల్లిస్తే సరి

ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1,000 చదరపు అడుగులు లేదంటే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్‌లు, దుకాణాలు షెల్ఫ్-ఇన్-షాప్ పద్ధతిని అవలంబించవచ్చు.

అయితే, ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్లకు మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్య నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.

సూపర్ మార్కెట్లు, వాక్ ఇన్ స్టోర్లలో వైన్ విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందని దుమ్మెత్తి పోసింది. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్రను ‘మద్య రాష్ట్రం’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/