మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ పునఃప్రారంభమైన సినిమా హాళ్లు

ముంబయి : క‌రోనా నేపథ్యంలో మ‌హారాష్ట్ర‌లో గ‌త కొన్ని నెల‌లుగా మూత‌ప‌డ్డ సినిమాహాళ్లు, థియేట‌ర్లు ఇవాళ మ‌ళ్లీ పునఃప్రారంభ‌మ‌య్యాయి. గ‌త నెల‌లో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే మాట్లాడుతూ వ‌చ్చే నెల నుంచి రాష్ట్రంలో థియేట‌ర్ల‌ను, సినిమా హాళ్ల‌ను పునఃప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఆ మేర‌కు ఇవాళ సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అయితే 50 శాతం కెపాసిటీతో మాత్ర‌మే సినిమా హాళ్లు న‌డుస్తాయ‌ని మ‌హారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ తెలిపారు.

రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాహాళ్లు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తించాల‌ని థియేట‌ర్ల ఓన‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ని, కానీ దీపావ‌ళి వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని తాము వారికి సూచించామని అజిత్ ప‌వార్ చెప్పారు. దీపావ‌ళి త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డితే సీటింగ్ కెపాసిటీ పెంచుతామ‌న్నారు. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌హారాష్ట్రలో 2020, మార్చి నెల‌లో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఆ త‌ర్వాత 2020, న‌వంబ‌ర్ నుంచి 2021, ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగాయి. ఏప్రిల్‌లో మ‌ళ్లీ మూత‌ప‌డ్డాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/