నారాయణ కాలేజీ ఘటన ఫై మధు యాష్కీ సీరియస్

అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ గౌడ్ డిమాండ్‌ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

అసలు ఏంజరిగిందంటే..

రామంతపూర్ కు చెందిన విద్యార్థి సాయి నారాయణ అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటంతో టీసీ కోసం కాలేజీ కి వెళ్ళాడు. ఫీజు బాకీ ఉండడంతో కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో ఈరోజు స్టూడెంట్ యూనియన్ లీడర్లతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లారు. టీసీ విషయంలో ప్రిన్సిపల్ ఆశోక్ రెడ్డికి విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని భయపెట్టే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్, విద్యార్థి వెంకటాచారితో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు ఏఓకు గాయాలయ్యాయి. అయితే స్టూడెంట్ యూనియన్ లీడర్ స్వయంగా నిప్పు పెట్టుకున్నాడా లేక గదిలో దేవుడి ముందు వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయా అన్నది తెలియాల్సి ఉంది.