మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన

మా సభ్యత్వంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు సారథ్యంలోని గవర్నింగ్ బాడీ ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా విష్ణు అండ్ టీమ్ గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మీడియా సమావేశంలో మంచు విష్ణు.. తాము ఈ ఏడాది కాలంలో చేసిన పనుల గురించి వివరించారు.

“‘మా’లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. 5 నిమిషాలైనా సినిమాలో డైలాగు చెప్పిన వాళ్లకే అసోసియేట్‌ సభ్యత్వం. అసోసియేట్‌ సభ్యులకు ‘మా’లో ఓటు హక్కు లేదు” అని తేల్చి చెప్పారు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం మినహా మ్యానిఫెస్టోలోని వాగ్దాలను 90 శాతం పూర్తిచేశామని విష్ణు వెల్లడించారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా గెలిస్తే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇప్పిస్తానని ఆరోజు వాగ్దానం చేశానని.. ఆ అవకాశాల కోసం తామొక పుస్తకాన్ని ప్రచురించామని విష్ణు తెలిపారు.