‘మా’ ఎలక్షన్స్ : పోలింగ్ బూత్ కు చేరుకుంటున్న సినీ తారలు

‘మా’ ఎన్నికల యుద్దానికి తెరపడే రోజు వచ్చేసింది. గత నెల రోజులుగా నువ్వా..నేనా అన్నట్లు సాగుతున్న మా వార్ కు మరికొన్ని గంటల్లో ఫలితం రాబోతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ తమ సభ్యులతో కలిసి పోలింగ్ బూతు కు వచ్చారు.

ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈసారి మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్ అధ్యక్ష పోటీ చేస్తున్నారు. మా అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం 54 మంది అభ్యర్థులు పోటీ గా నిలిచారు. ఇందులో గెలిచిన అభ్యర్థులు 2021-23 సంవత్సరానికిగానూ ‘మా’ లో బాధ్యతలు నిర్వర్తిస్తారు. విష్ణు సీనియర్ నటీనటుల మద్దతు కూడగట్టుకోగా.. ప్రకాశ్ రాజ్ మెగా కుటుంబంపై ఆశలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 883 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి చివరికి ఎంతమంది పోలింగ్ కేంద్రానికి వస్తారో చూడాలి. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తికానుండగా ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్‌ రాజ్‌ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్‌ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్‌ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్‌ రాజ్‌ను భుజం తట్టాడు.