చిరంజీవి చెప్పడం వల్లే ‘మా’ ఎన్నికల తేదీ ప్రకటించారా..?

‘మా’ సమరం..రాష్ట్ర ఎన్నికలను తలపిస్తుంది. పట్టుమని 1000 మంది కూడా లేని ‘మా’ లో ..ఈసారి ఏకంగా ఆరుగురు సభ్యులు మా పీఠం దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. మొన్నటివరకు ఒక వర్గం ఎన్నికలు కావాలని, మరో వర్గం ఎన్నికలు అక్కర్లేదు.. ఏకగ్రీవం చాలంటూ వాదోపవాదనలు చేసుకుంటున్న తరుణంలో.. ‘మా’ క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదీని ప్రకటించి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం ఎదురుచూస్తోన్న పలు ప్యానెల్ సభ్యుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీకి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈ ఎన్నికలు ‘మా’కు సొంత బిల్డింగ్ కట్టాలనే హామీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే డిమాండ్ వినిపించింది. ఇటీవల విష్ణు మా భవనానికి స్థలం ఇదిగో అంటూ మరో వీడియోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆయన మా అధ్యక్షుడిగా ఖరారే అనుకున్న క్షణంలో.. క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదీ ప్రకటించి విష్ణు కు షాక్ ఇచ్చింది. చిరంజీవి రీసెంట్ గా క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడం జరిగింది. లేఖ లో ఎన్నికలు పెట్టాల్సిందే..అది కూడా త్వరగా పూర్తి చేయాలనీ కోరడం తో క్రమశిక్షణ సంఘం ఎన్నికల తేదిని ప్రకటించిందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఎన్నికల తేదీ ప్రకటన రావడంతో ప్యానెల్ సభ్యులు తమ ప్రచారంలో మునిగిపోయారు.