“మా” ఎన్నిక‌ల నోటిషికేష‌న్ విడుదల..

మా మూవీ ఆర్టిస్టులంతా ఎదురుచూస్తున్న మా ఎన్నిక‌ల నోటిషికేష‌న్ వచ్చేసింది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌ల‌ను నిర్వహించబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయం, ప్లేస్ వంటి వివరాలు తాజాగా ప్రకటించారు. అక్టోబ‌ర్ 10న జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 71 లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఉదయం 8గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంట‌ల నుండి ఓట్ల‌ను లెక్కించి సాయంత్రం 7గంట‌లకు ఫ‌లితాల‌ను వెల్లడించనున్నారు. ఈ నెల 27 నుండి 29 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 30న నామినేషన్స్ పరిశీలన జరుగుతుంది.

నామినేషన్స్ ఉపసంహరణకు వచ్చే 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. ఇక ఎలక్షన్స్‏లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అక్టోబర్ 2న ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.

తాజాగా విడుదలైన నోటిఫికేషన్‏లో నిబంధనలు చూస్తే…

  • ఒక అభ్యర్ధి ఒక పోస్టుకే పోటీ చేయాలి
  • గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది.
  • 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేరర్‏గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని తెలిపారు.

ప్ర‌కాష్ రాజ్ ప్యానల్ సభ్యుల వివరాలు ఆల్రెడీ తెలియపరచగా..విష్ణు ప్యానల్ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు విష్ణు ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కోసం రఘుబాబు పోటీలోకి దిగుతున్నారు. జనరల్‌ సెక్రటరీ గా విజయం సాధించేందుకు ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే నిర్మాత బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు.