ఐపీఎల్‌ చరిత్రను తిరగరాసిన లక్నో..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) చరిత్రలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు స‌రికొత్త రికార్డును త‌న‌పేరిట లిఖించుకుంది. ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా న‌ష్ట‌పోకుండా పూర్తిగా 20 ఓవ‌ర్లు ఆడి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో జ‌ట్టు… త‌న బ్యాటింగ్ స‌త్తా ఏమిటో నిరూపించింది. ల‌క్నో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో క‌లిసి ప్రారంభించిన స్టార్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్‌… త‌న బ్యాట్ ప‌వ‌రేమిటో చూపాడు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ సెంచరీ చేయగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో బెస్ట్ పార్టనర్‌షిప్‌గా జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ పేరుమీద ఉన్న 184 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేస్తూ.. కేఎల్ రాహుల్, డికాక్ జోడి ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ 210 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. డికాక్ 200 స్ట్రయిక్ రేట్‌తో 140 (70), రాహుల్ 68 (51) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 2016 ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన క్వింటన్ డికాక్.. ఆరేళ్ల తర్వాత కేకేఆర్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెండో సెంచరీ నమోదు చేశాడు. 70 బంతులు ఆడిన డికాక్ 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన క్వింటన్ డికాక్ 140 బెస్ట్‌తో 502 పరుగులు చేశాడు.