ఆంజనేయుడి లంకా దహనం

ఆధ్యాత్మిక చింతన

Lord Hanuma
Lord Hanuma

సీతమ్మను వెతుకుటకై లంకు వెళ్లిన ఆంజనేయుడు మేఘనాథుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో వెల్లకిలా పడినట్లుగా రథంలో పడుకుని నటిస్తున్నాడు.

బ్రహ్మాస్త్ర ప్రభావంచే తాను బందీ అయినట్లుగా నటిస్తున్న ఆంజనేయుడు ఏ మాత్రం బెరుకు లేకుండా రావణుని ముఖంకేసి చూస్తూ నిర్మొహమాటంగా నిర్ద్వంద్వంగా పలికాడు.

నీవెంతటి గొప్ప వాడవైనప్పటికీ మా శ్రీరాముని ధర్మగుణము ముందు నీ తపశ్శక్తి సైతం ఆవగింజతో సమానం.

మేఘనాథుడు నా పై యుద్ధం చేయకముందు నా చేతిలో వధింపబడిన మీ రాక్షసుల పేర్లను, సంఖ్యను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదనుకుంటాను.

నేనొక్కణ్ణి అంతమందిని మట్టుబెట్టాను గదా. అదే మా వానరసైన్యం కదలివస్తే మీ లంక అణు మాత్రమైనా మిగలదు.

వాడియైన మా గోళ్లు, బలిష్టమైన మాదంతముల కన్నా మించిన ఆయుధములు మీ వద్దలేవని తెలుసుకుని మసలుకోగలిగితే రాముడు నిన్ను తప్పక క్షమిస్తాడు.

నీలో మార్పు వస్తుందనే సదుద్దేశంతో మాత్రమే రాముడు తొందరపడి నిన్ను వధించకుండా ఓర్పు వహించి ఉన్నాడు అంటూ ఆంజనేయుడు మాట్లాడుతున్నాడు.

తన రాజ్యానికి వచ్చి తన మంత్రివర్గ సమక్షంలోనే ఆంజనేయుడు మాట్లాడే తీరుకు ముగ్ధుడై తనను తానే మరచిపోయాడు రావణుడు.

కానీ మరుక్షణమే తేరుకుని యధాతథమైన రాక్షసబుద్ధి కలిగినవాడై ఆంజనేయునికి మరణదండన విధించాడు రావణాసురుడు.

దూతగా వచ్చిన వానికి మరణదండన విధించటం ధర్మ విరుద్ధమని నొక్కి వక్కాణించాడు విభీషణుడు.

ఏ శిక్ష విధిస్తే న్యాయబద్ధమో తెలుపుమన్నాడు రావణుడు తన మంత్రులతో మరలా విభీషణుడే కలుగజేసుకుని శిరోముండనము తోక కతిరించుట, కొరడా దెబ్బలులాంటి శిక్షలు విధించవచ్చునని తెలియజేశాడు.

తోకను కత్తిరించటం నాకెందుకో అసహ్యకర రీతిలో గోచరించుచున్నది.

అందువల్ల తోకకు పేలికలను కట్టి నూనెపూసి, ఆ పై నిప్పుతో అంటించవలసినది అంటూ ఆజ్ఞాపించాడు రావణాసురుడు.

ఎక్కడెక్కడి నుండో పేలికలను సేకరించి ఆంజనేయుని తోకకు కట్టి నూనెను పూసి నిప్పంటించారు క్షణాలలో రాక్షసులు. నిప్పంటించిన తోకను చూసుకుంటూ లంకలోని ఇళ్లను తగులబెట్టసాగాడు.

ఇంతలో సీతమ్మ గుర్తుకు వచ్చి ఆ తల్లి కూర్చొని యున స్థలం కూడా మంటలలో చిక్కి బూడిదైపోయిందేమోనని భయపడి ఒక్క ఉదుటున సీతమ్మ కూర్చుని ఉన్న అశోకవనానికి దుమికాడు ఆంజేయుడు.

ఇంతకుముందే రాక్షసుల ద్వారా ఆంజనేయుని లంకాదహనం గురించి తెలుసుకున్న సీతమ్మ ఆంజేయస్వామిని లంకాదహనం గురించి తెలుసుకున్న సీతమ్మ ఆంజనేయస్వామిని ఈ రోజు ఉండి రేపు వెళ్లు అంది.

తల్లీ! నిన్ను వెదికే బాధ్యతను నా భుజస్కంధాలపై ఉంచి నన్ను పునీతుని చేసిన నా రామచంద్రుని వద్దకు వెంటనే వెళ్లి ఈ శుభవార్తను తెలిసిన మరుక్షణం నుండి మాత్రమే నాకు మనశ్శాంతి కలుగుతుంది.

నన్ను ఆశీర్వదించు తల్లీ… అంటూ సీతమ్మకు ప్రణమిల్లాడు ఆంజనేజయస్వామి. తనకెంతో ప్రాణప్రదమైన సీతమ్మను దూరం చేసుకున్న రాముడు దయనీస్థితిలో ఉన్నాడు.

లక్ష్మణుడు రామన్నకు ధైర్యం చెపుతుండగా ఆంజనేయస్వామి వారి వద్దకు వెళ్లి చూశాను సీతమ్మను అన్నాడు.

ఆ మాటను విన్న వెంటనే ఆనందపరవశంతో పులకించిన రాముడు ఆంజనేయుని వైపు చూస్తూ భోరున విలపించాడు.

రాముని స్థితిని చూసిన ఆంజనేయస్వామికి సైతం దుఃఖం కట్టలు తెంచుకుంది. లంకు దిగ్విజయంగా వెళ్లి వచ్చి చూశాను సీతమ్మను. ఆమె జీవించే ఉంది.

అనే పరమ ఆనందదాయకమైన సమాచారాన్ని అందించి లోని నిరాశ, నిస్పృహలను తరిమికొట్టి నూతన ఉత్సాహాన్ని నింపిన శుభసందర్భంలో తన మనస్సు సంతోషానికి కారణమైన ఆంజనేయుడిని చూసి ఆనందంతో చేతులు చాచి తన బిగి కౌగిలిలో ఆంజనేయుస్వామిని బంధించాడు.

అన్యులకు దొరకని ఆ శ్రీరామ చంద్రుని కౌగిలి లభ్యమైనందుకు అంతుని ఆనందాన్ని తన సొంతం చేసుకున్నాడు ఆంజనేయస్వామి.

శ్రీరామచంద్రుని ఆనందభాష్పాలతో ఆంజనేయుని భుజములు తడువగా ఆంజనేయుని ఆనందభాష్పాలతో శ్రీరామచంద్రుని భుజములు తడిసినవి.

పరస్పరం ఒకరి భుజంపై మరొకరు ఆనందాశ్రువ్ఞలు ఒలికించుకొన్న శ్రీరామచంద్రుని రామబంటును వారి మైత్రిని తలచుకోవాలి.

-ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/