మంత్రి పెద్దిరెడ్డికి నారా లోకేష్ వార్నింగ్

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ యాత్ర 33 వ రోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట అని విమర్శించారు. భూములు దోచుకున్నందుకు పెద్దాయన అని పిలవాలా? మట్టిని, ఇసుకను దోపిడీ చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? దేనికి పిలవాలని ప్రశ్నించారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి అమూల్ డైరీని తీసుకొచ్చారని… కానీ పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని విమర్శించారు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ కోసమే అమూల్ ను ఇక్కడకు తీసుకురాలేదని దుయ్యబట్టారు. పాలకు తక్కువ ధరను చెల్లిస్తూ పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

అటవీశాఖకు చెందిన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. రూ. 10 వేల కోట్లను పాపాల పెద్దిరెడ్డి దోచుకున్నారని… ఆయనను శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని… దోచుకున్నదంతా కక్కించి పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామని లోకేష్ అన్నారు. తాగే నీళ్ళు లీటరు రూ.20 అమ్ముతున్న రోజుల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి లీటర్ పాలుకు రూ.16 ఇచ్చారన్నారు. చల్లా బాబు పోరాటంతో ఆ ధరను ఇప్పుడు పెంచినట్లు తెలిపారు. అయినా బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని.. పుంగునూరు, పీలేరు, మదనపల్లిని మదనపల్లి జిల్లాలో కలుపుతామన్నారు.