ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేయాలి

జ‌గ‌న్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది: లోకేశ్

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్యోగాలు రాక యువ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. ‘వైఎస్ జ‌గ‌న్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటోంది’ అని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం’ అని లోకేశ్ చెప్పారు.

‘వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. పోరాడి ఉద్యోగాలు సాధిద్దాం’ అని నారా లోకేశ్ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/