పేద‌పిల్లల‌కు ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జగన్​కు నారా లోకేష్ లేఖ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..సీఎం జగన్ కు లేఖ రాసారు. పేద‌పిల్లల‌కు ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దని , జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనం నిర్ణయం పేద విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యకి దూరం చేస్తోందని లేఖ లో పేర్కొన్నారు. స్కూల్స్ ఓపెన్ అయినా రోజే జగన్ తీసుకున్న నిర్ణయం ల‌క్షలాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు శ‌రాఘాతంగా మారిందని లోకేష్ పేర్కొన్నారు.

“ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ జీవో 117 వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయి. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల‌లోను, హైస్కూల్స్‌లోను కలపటంవల్ల ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్ప‌త్తి పూర్తిగా పెరిగిపోయింది. జాతీయ విద్యావిధానం అమ‌లు చేయడం కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ని త‌గ్గించే ఆతృత మీలో క‌నిపిస్తోంది. ఈ విద్యా విధానం వ‌ల్ల ప్ర‌స్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్య‌త్తులో 11 వేల‌కి త‌గ్గిపోనున్నాయి. బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్క‌డం మీ దృష్టికి వ‌చ్చే ఉంటుంది. పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య‌ని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణ‌యాల‌ని వెన‌క్కి తీసుకోవాలి. ’’ అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే ఉపాధ్యాయుల కొర‌త‌, అర‌కొర సౌక‌ర్యాల‌తో ప్రభుత్వ విద్యాల‌యాలు సమస్యల వలయంలో చిక్కుకుంటే.., పాఠశాల‌ల విలీన నిర్ణయం మూలిగే న‌క్కపై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైందని దుయ్యబట్టారు. స్కూల్స్ విభ‌జించాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం స్పష్టం చేసినా.. ప్రభుత్వం ప‌ట్టించుకోకుండా విభ‌జించ‌టంతో స‌మ‌స్య తీవ్రమైందని మండిపడ్డారు.