జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే..ముందు ముందు వైసీపీ కి పెద్ద సినిమా చూపిస్తాం – నారా లోకేష్

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..ముందు ముందు వైసీపీ కి పెద్ద సినిమా చూపిస్తాం అని అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భాంగా లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రెండున్నరేళ్లు ఓపిక పడితే చంద్రబాబు సీఎం అవుతారని.. అప్పుడు అందరి పని చెబుతామని అన్నారు. 2019 ముందు నాపై ఏ కేసూ లేదు.. ఏ పోలీస్ స్టేషనుకు వెళ్లలేదు.. జగన్ సీఎం అయ్యాక నాపై హత్యాయత్నం సహా 11 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. జగన్ తరహాలో నేనేం మా చిన్నాన్న జోలికెళ్లలేదని.. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసును తేల్చాలని డిమాండ్ చేశారు.

హత్యాయత్నం కేసులు పెడితే నా బండి ఆగదు.. మరింత స్పీడుగా వెళ్తుందని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతోన్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. 2024 లో మంగళగిరిలో భారీ మెజార్టీ తో గెలిచి చంద్రబాబు కు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఫోన్‌నంబరు తనకు తెలియదని, అందుకే ఫోన్‌ తీయలేకపోయానన్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యలను లోకేశ్‌ ఆక్షేపించారు. ‘ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నంబరు నిజంగా ఆయనకు తెలియదా? తన పోస్టింగ్‌ కోసం ఆయన చంద్రబాబుకు నాలుగైదుసార్లు ఫోన్‌ చేయలేదా? ఇంటిముందు పడిగాపులు పడలేదా? అవన్నీ మర్చిపోయారా’ అని ప్రశ్నించారు. ‘తన తల్లిని ఏదో అన్నారని జగన్‌ ఆవేదన వలకబోస్తున్నారు. ఆయన మంత్రులు రాష్ట్రంలోని తల్లులందరినీ అన్నప్పుడు అవి ఆయనకు వినిపించలేదా? అమ్మను తిట్టింది ఈ రాష్ట్రంలో మొదట ఎవరు? ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు తల్లిని దూషించలేదా? అవన్నీ గుర్తు లేనట్లు జగన్‌రెడ్డి ప్రదర్శిస్తున్న నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వలేకపోయునా కనీసం భాస్కర్‌ అవార్డు అయినా ఇవ్వొచ్చు’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

కొన్ని పిల్లులు పులులమను కుంటున్నాయని.. ఒక చెంప కొడితే రెండు చెంపలు కొడతామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని.. ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా వదిలి పెట్టమన్నారు. మా పార్టీ కార్యాలయంలో పగిలినవి.. అద్దాలే మా కార్యకర్తల గుండెలు బద్దలు కొట్టలేరన్నారు. మాది పేటీఎం బ్యాచ్ కాదు.. పసుపు సైన్యమని పేర్కొన్నారు నారా లోకేష్.