తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు
ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు
తర్వాత గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు
Lockdown in Telangana
హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించాలని నిర్ణయించారు.
సాయంత్రం 5 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్‌డౌన్ యథాతథంగానే కొనసాగించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/