6 ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ న‌మోదైంది. మొత్తంగా పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 90 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జ‌రిగింది. పోలింగ్‌ ప్రక్రి‌యను వెబ్‌‌క్యా‌స్టింగ్ చేశారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే.. మెద‌క్ జిల్లాలో అత్య‌ధికంగా 96.69 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆ త‌ర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 87.73 శాతం పోలింగ్‌, న‌ల్ల‌గొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్‌, ఖ‌మ్మం జిల్లాలో 79.95 శాతం, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 72.08 శాతం పోలింగ్ న‌మోదైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/