బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్..

బ్రిటన్​ నూతన ప్రధానమంత్రిగా లిజ్​ ట్రస్​ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ పై ఆమె గెలుపొందారు. బోరిస్ జాన్సన్ స్థానంలో ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నెల రోజులకుపైగా సుదీర్ఘంగా సాగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలను సోమవారం వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌‌వైపు మొగ్గుచూపారు.

సునాక్‌పై ట్రస్ ఏకంగా 20వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురేశారు. పోలైన మొత్తం ఓట్లలో సునాక్‌కు 60,339 రాగా.. ట్రస్‌కు 81,326 ఓట్లు వచ్చాయి. దీంతో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచారు. అంతకు ముందు థెరిసా మే , మార్గరేట్ థాచర్‌లు మాత్రమే బ్రిటన్‌ మహిళా ప్రధానులుగా పనిచేశారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్టు తెలిపారు.

ప్రధానిగా ఎన్నికైన లిజ్​ ట్రస్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో భారత్​- బ్రిటన్​ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.