ప్రమాణస్వీకారం చేయకుండానే మృతిచెందిన బీజేపీ నేత

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించిన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఈ విజయోత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని భావించింది. కానీ అనుకోకుండా బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత మృతిచెందడంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

లింగోజిగూడ కార్పొరేటర్‌గా ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్, తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి ముద్రబోయిన శ్రీనివాసరావుపై 2811 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇంకా ప్రమాణస్వీకారం చేయని ఆకుల రమేష్ గౌడ్, ఇటీవల కరోనా బారిన పడ్డారు. కాగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

బీజేపీలో కీలక నేతగా వ్యవహరించిన ఆకుల రమేష్ గౌడ్, గతంలో ఎల్బీనగర్‌ మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆకుల రమేష్ గౌడ్ మృతిపట్ల పలువురు బీజేపీ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు. బీజేపీ ఓ ముఖ్య నేతను కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు అన్నారు.