త్వరలో అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలనీ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐదు వేల ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత స్కూళ్లల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ రెడీ అవుతుంది.

నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి ఒక్కొ లైబ్రరీకి 120 పుస్తకాలు అందించాలని విద్యశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసిన తర్వాత 6 లక్షల పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. గవర్నమెంట్ టెస్ట్‌బుక్ ప్రెస్ ద్వారా ముద్రించి ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాలు అందించనుంది. విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ‘తొలిమొట్టు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని భావించింది. లైబ్రరీలలో వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. రోజూ 15 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ కూడా కొత్తగా ప్రవేశపెడతారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను విద్యార్థులు చదివేలా చర్యలు చేపట్టనున్నారు.

లైబ్రరీలు ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, విద్యార్థుల్లో పుస్తకాల పట్ల మక్కువ పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.