ఆ చిన్నారులకు చేయూతనిద్దాం

Physically Handicaped children

మనదగ్గర దివ్యాంగ పిల్లలకు అన్ని విధాలా, అన్ని అవసరాలకు సరిపడిన పాఠశాలలు లేవనే చెప్పుకోవాలి. ఉపాధ్యాయులకూ అలాంటి పిల్లలకు చదువులు చెప్పే నైపుణ్యం లేకపోవచ్చు దీనికి వాళ్లను తప్పుపట్టలేం.
సంధ్య నెలలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండుమూడు నెలల తర్వాత తెలిసింది ఆ బాబు భవిష్యత్తులో నడవలేడని. పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడి వ్ఞన్నాయి. బాబులో ఎదుగుదల అసలే లేదు. సంధ్య కుమిలికుమిలి ఏడ్చింది. బిడ్డ జీవితాంతం అంగవైకల్యంతోనే జీవించాలని, ఇతరుల సాయం తప్పనిసరని గ్రహించి, గుండె బరువైపోయింది. సంధ్య భర్త కూడా ఆవేదన చెందుతున్నాడు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలో లేక వైకల్యంతో జన్మించినందుకు బాధపడాలో ఆ దంపతులకు అర్ధం కావడం లేదు. కొంతమంది బుద్ధిమాద్యంతో జన్మిస్తే, మరికొందరు అంగవైకల్యంతో జన్మిస్తారు. వీరికి జీవితాంతం ఎవరో ఒకరు సేవలు చేయాల్సిందే. ఇది కొద్దిగా బాధాకరమైన విషయమే. అలాగని ఆ పిల్లల్ని వదిలించుకోవాలని ఏ తల్లిదండ్రులు భావించరు. ఎందుకంటే ఎవరి పిల్లలు వారికి ముద్దు. శారీరకంగానో మానసికంగానో మిగతావాళ్లలా లేకపోయినా వారిపై ప్రేమ తగ్గేది కాదు. వాళ్లు మన బంగారు కొండలే. నిజానికి పిల్లలకు చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది జీవితాంతం వెంటాడుతూ వచ్చే వైకల్యాన్ని ఎదుర్కొంటుంటే ఇంకెంత బాధపడాలి? దీన్ని తట్టుకోవటం కష్టమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాని అలాంటి చిన్నారిని అద్భుత వరంగా అరుదైన బహుమతిగా భావిస్తే మనసు కొంతైనా తేలికపడుతుంది. మరింత ప్రేమను పంచటానికి శ్రద్ద చూపటానికి వీలవుతుంది. కాళ్లు చేతులు లేనివారు సైతం అద్భుతంగా పెయింటింగ్‌ వేస్తూ, ఔరా అనిపించుకుంటున్నారు. చేతులు లేకపోయినా కాళ్లతోనే అన్ని పనులు చేసేవారున్నారు. కాలితో అందంగా రాసేవారున్నారు. చేతులు లేకపోయినా అద్భుతంగా గిటార్‌ వాయించేవారున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వైకల్యంతోనే ప్రతిభను చాటుకుంటున్నారు. ఆలాగే చిన్నారులకు ఎలాంటి విషయాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయో గుర్తించటం కీలకం. కొందరు బొమ్మలను చూసి కేరింతలు కొట్టొచ్చు. కొందరు బయటి వాతావరణాన్ని చూసి సంతోషించొచ్చు. పక్షులను చూసి కిలకిలమని నవ్వొచ్చు ఇలా వారికి ఇష్టమైనవేంటో తెలుసుకొని మసలుకొంటే పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుంది. ఒత్తిడికి లోనవటమూ తగ్గుతుంది. పిల్లలకు ఏదో వైకల్యముందని మిగతావాళ్లలా లేరని తెలియగానే ఎవరికైనా మనసు కలుక్కుమనే అంటుంది. తాము కన్న మధురమైన కలలు తమ ముందే విరిగిపోతే మదిలో కలతే నిండుకుంటుంది. అది సహజం కూడా. అందరిలా ఆడలేక, పాడలేక, గెంతలేక, కేరింతలు కొట్టలేక పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రుల మనసు సంతోషంగా ఎలా ఉంటుంది. ఇది క్రమంగా కొందరిలో మనస్తాపానికి దారితీస్తుంది. తమకే ఎందుకిలా జరిగింది? ఎవరికేం పాపం చేశామో? అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. అయితే వాస్తవాన్ని గుర్తించి అంగీకరించటం అన్నింటికన్నా ప్రధానం. ఇలా జరగాలనేమీ కోరుకోలేదు. అయినా జరిగిపోయింది. ఇప్పుడిక దాన్ని వెనక్కి తిప్పటం సాధ్యం కాదు. ఈ నిజాన్ని గుర్తించగలిగితే కర్తవ్యం బోధపడుతుంది. పిల్లల అవసరాలేంటి? వాటినెలా తీర్చగలం? సవాళ్లను ఎలా ఎదుర్కోగలం? అని ఆలోచనలతో ముందడుగు వేయటానికి వీలవుతుంది.
చదువులపై కాస్త శ్రద్ధ చూపాలి: దివ్యాంగులంతా ఒకేలా ఉండాలనేమి లేదు. వారి అవసరాలూ వేర్వేరుగా ఉండొచ్చు. ముఖ్యంగా విషయగ్రహణలో చాలా తేడాలుండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పద్ధతిలో చదువులు చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. వారికి అలాంటి ప్రత్యేక శిక్షణ ఏదీ ఇచ్చి ఉండక పోవచ్చు. అందువల్ల బడుల్లో సదుపాయాలు అంతగా లేకపోయినా సర్దుకుపోవటమే మంచిది. తోటి పిల్లలు హేళన చేస్తారనే భయం వద్దు కొంతకాలానికి అన్నీ సర్థుకుంటాయని గుర్తించాలి. నలుగురితో కలవటం వల్ల పిల్లల్లో మానసిక వికాసమూ మెరుగవుతుంది. మరీ ఇబ్బంది పడుతున్నారని అనుకుంటే ఇంట్లోనే ప్రత్యేకంగా చదువు చెప్పించొచ్చు.
సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి: పిల్లలకు వచ్చిన వైకల్యమేంటి? దానికి గల కారణాలేంటి? అనేవి వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అలాంటి సమస్యలపై నిర్వహించే సదస్సులకు హాజరు కావటం.. అలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇతర పిల్లల కుటుంబాలను కలవటం వంటివి ఎంతో మేలు చేస్తాయి. దీంతో సమస్య గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవచ్చు. అలాంటి పిల్లల కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనేవి అర్థమవుతాయి. ఇలా వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్న కొద్దీ పరిష్కార మార్గాల అన్వేషణ సులభమవుతుంది.
ఇది వింతేమి కాదు: అందరిలా లేనివారిని చుట్టపక్కల వాళ్లు వింతగా చూస్తుంటారు. పెళ్లిళ్లకో, పేరంటానికో తీసుకెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితి మరింత ఇబ్బందికరంగానూ పరిణమిస్తుంటుంది. అంతమాత్రాన నొచ్చుకోవాల్సిన పనేమీ లేదు. భిన్నంగా ఉన్నవాటిని చిత్రంగా చూడటమనేది మానవ నైజమని అర్థం చేసుకోవాలి. మన సమాజంలో ఆయా వైకల్యాల పట్ల అవగాహన లేకపోవటమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతుంటూ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చుట్టుపక్కల వాళ్లకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయాలి. దీంతో అపార్థాలేవైనా ఉంటే తొలగిపోతాయి.
నిరంతరం పిల్లలు కనిపెట్టుకుని చూసుకోవటం శారీరకంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి దారితీస్తుంటుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారని గుర్తించాలి. అన్ని సార్లూ మనమే అన్ని అవసరాలను తీర్చలేకపోవచ్చు కాబట్టి అవసరమైతే బంధువులు, స్నేహితుల సాయమూ తీసుకోవచ్చు. దీంతో కొంత వెసులుబాటు దక్కినట్లూ అవుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/