నా రాజీనామాకు ఆమోదం తెలుపండి..అందరం కలిసి పనిచేద్దాం: శరద్‌ పవార్‌

let-us-all-work-together-but-accept-my-resignation-says-sharad-pawar-to-party-workers-opposing-his-resignation

ముంబయిః నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ క్యాడర్‌లో కలకలం రేపింది. శరద్‌ పవార్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీలో ఎప్పటిలాగే అందరం కలిసి పనిచేద్దామని, తన రాజీనామాకు అందరూ ఆమోదం తెలుపాలని ఆయన కోరారు.

తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, తన పొలిటికల్‌ లైఫ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుందని, కాకపోతే పార్టీ అధ్యక్ష పదవిని వదిలేయడంతోపాటు ఇకపై ఎన్నికల్లో పోటీచేయబోనని చెప్పారు. అయినా ఎన్సీపీ శ్రేణులు ఒప్పుకోవడం లేదు. శరద్‌ పవార్‌తో మాట్లాడి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని ఆయన కుమార్తె సుప్రియా సూలేకు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పెద్దాయన వయసును, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారని, ఇక ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదని చెప్పారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని సుప్రియా సూలే తన తండ్రి పవార్‌ను కోరే ప్రయత్నం చేసిందని, కానీ ఆమెకు పెద్దన్నగా తాను ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని అజిత్‌ పవార్‌ చెప్పారు. అయితే, పవార్‌ రాజీనామాను అంగీకరించాలా.. వద్దా..? అనే దానిపై పార్టీ సీనియర్‌ నాయకులతో ఒక కమిటీ వేశామని, ఆ కమిటీ నిర్ణయానికి అందరం కట్టుబడాలని అజిత్‌ పవార్‌ కోరారు. పవార్‌ జీ కూడా కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.