వార్నర్‌ రాకపై లక్ష్మణ్‌ సంతోషం…

V. V. S. Laxman
V. V. S. Laxman

హైదరాబాద్‌: ఐపిఎల్‌ 12వ సీజన్‌ ఆరంభం సందర్భంగా ఈసారి సన్‌రైజర్స్‌ జట్టులో వార్నర్‌ రాక మినహా ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు మార్గదర్శకుడు వివిఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. వార్నర్‌ రాకతో సన్‌రైజర్స్‌ జట్టు మరింత బలంగా మారనుందని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది మార్చిలో వార్నర్‌, స్మిత్‌ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మరో కొద్దిరోజుల్లో వీరి నిషేధం ముగియనుంది. దీంతో ఐపిఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వారికి అవకాశం లభించనుంది. కాగా, ఐపిఎల్‌లో ఇదివరకు సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి వార్నర్‌ నిషేధం అనంతరం ప్రధాన ఆటగాడిగా కొనసాగనున్నాడు. వార్నర్‌ నిషేధంతో గతేడాది అనూహ్యంగా కెప్టెన్సీ అందుకున్న న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ఈసారి కూడా బాధ్యతలు కొనసాగిస్తాడని చెప్పారు. అలాగే భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. వార్నర్‌ గురించి మాట్లాడుతూ…సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వార్నర్‌ చేసిన సేవలు ఎంతో గర్వకారణం. అతనెప్పుడూ మా ప్రధాన ఆటగాడుగానే ఉంటాడు. వార్నర్‌పై విధించిన నిషేధం తప్పని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే అతడిని చాలా దగ్గరి నుంచి నేను చూశాను. మళ్లీ సన్‌రైజర్స్‌ జట్టుతో కలిసి సహకరిస్తాడని ఆశిస్తున్నానని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చారు. కాగా ఆదివారం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ మొదటి మ్యాచ్‌ ఆడనుంది.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: