ఒంటరి పోరులో లక్ష్మణ్‌కు మూడవస్థానం

K. Laxman
K. Laxman

విద్యానగర్‌,: ముషీరాబాద్‌ నియోజవర్గ ఓటరు తీర్పు రాజకీయ పార్టీలకు షాక్‌ ఇచ్చింది. హోరిహరిగా సాగిందనుకున్న ముందస్తు పోరులో ఫలితం పూర్తి ఏకపక్షంగా వచ్చింది. భారీ మెజారిటితో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠాగోపాల్‌ విజయం సాధించడంతో అసలేం జరిగిందంటు బూత్‌లవారిగా సాగిన ఓటింగ్‌పై అంతా లెక్కలు వేస్తున్నారు. ముందు నుంచి గెలుపుపై దీమాగా ఉన్న బిజెపికి ఈ పరిణామం మింగుడుపడటంలేదు. బిజెపి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అభ్యర్థిత్వమే ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అన్ని పార్టీల కంటే ముందు ఖరారైంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల పేర్లు ప్రకటించేనాటికి లక్ష్మణ్‌ ఒక విడత ప్రచారాన్ని సైతం ముగించారు. బూత్‌ కమిటిలు, డివిజన్ల వారీగా పరిశీలకులను నియమించి వ్యూహత్మకంగా ప్రచారం చేయడమే కాకుండా కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల వారీగా బేటిల్లోను లక్ష్మణ్‌ ముందున్నారు. దీంతో బిజెపి విజయం తథ్యమని, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండవ స్థానం కోసం ప్రయత్నిస్తున్నాయనే ఊహగానాలు వచ్చాయి. కాని పోలింగ్‌ మొత్తం ఏకపక్షంగా సాగి గెలుస్తాడనుకున్న లక్ష్మణ్‌ మూడవస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30769 ఓట్లు లక్ష్మణ్‌కు రాగా రెండు రౌండ్లలో ఐదు వందలకు మించిరాలేదు. పక్కా వ్యూహం ఉన్నప్పటికి సీనియర్లు సహకరించపోవడం, విద్యావంతులు ఓటింగ్‌కు రాకపోవడమే బిజెపి ఓటమికి కారణమని తెలుస్తుంది. ఒంటరి పోరు అని తెలిసినప్పటికి కొంతమంది నాయకుల అతివిశ్వాసం, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి డమ్మి అంటు చేసిన విష ప్రచారమే కొంపముంచిందని బిజెపి కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. నాలుగుసార్లు ఒంటరిగా పోరాడి ఓడిన తమ నేతకు గతం గుర్తుకు రాకపోగా చుట్టు ఉన్న కొంతమంది వేసిన తప్పుడు లెక్కల వల్లే మూడవ స్థానమని వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తం మీద చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌ కూటమి పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుకుని రెండవ స్థానాన్ని దక్కించుకుంటే సొంత పార్టీ కార్యకర్తలనే విస్మరించడంతో లక్ష్మణ్‌కు ఓటమి తప్పలేదని చర్చించుకుంటున్నారు.