నాసా ‘ఆర్టెమిస్‌ 1 ‘ ప్రయోగం వాయిదా

50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి పంపే బృహత్తర కార్యక్రమం వాయిదాపడింది. పవర్‌ఫుల్‌ రాకెట్‌ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రోజన్‌ లీకేజీ కారణంగా సోమవారం నాటి ‘ఆర్టెమిస్ 1’ లాంచ్ కౌంట్‌డౌన్‌ను మధ్యలో నిలిపివేశారు. T-40 నిమిషాల వద్ద కౌంట్‌డౌన్ నిలిపివేసినట్లు నాసా తెలిపింది. ఆర్టెమిస్ 1 లాంచ్ డెరెక్టర్‌తో మిషన్‌ ప్రణాళికలను హైడ్రోజన్ బృందం చర్చిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది.

ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. ఇంధన ట్యాంకర్​లో లీకేజీల కారణంగా పలుమార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది. అయితే, చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సోమవారం ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని వివరించింది.

1960లో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా అపోలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్‌ పరిశోధనల కోసం కాకుండా సోవియట్‌ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై ఉండలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు.