ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి సిద్ధం

సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్ గా నామకరణం

World’s largest COVID-19 care facility inaugurated in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని భారత్ నిర్మించింది. దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రికి ‘సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరుపెట్టింది. ఇందులో ఏకంగా 10 వేలకు పైగా పడకలు ఉన్నాయి. అన్ని హంగులతో సిద్ధమైన ఈ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. మరోవైపు, డీఆర్‌డీవో అధికారులు ఢిల్లీలోనే 12 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసి ప్రారంభించారు. కాగా, కరోనా రోగుల చికిత్స కోసం 500 రైల్వే కోచ్‌లతో 8 వేల పడకలు సిద్ధమవుతున్నాయి.

సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌ నిర్మాణంలో ఇండోటిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఐటీబీపీ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేసి 10 రోజుల్లో 10,200 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఇందులో ఐసీయూ, వెంటిలేటర్‌ విభాగాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి వేర్వేరు విభాగాల్లో పడకలు ఏర్పాటు చేశారు. రోగుల కోసం 600 మరుగుదొడ్లు నిర్మించారు. 70 పోర్టబుల్‌ టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఐటీబీపీకి చెందిన 170 మంది వైద్య నిపుణులు, 700 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది వెంటనే విధుల్లోకి దిగారు. వీరంతా 2,000 పడకల బాధ్యతను తీసుకోగా, మిగతా పారామిలటరీ దళాలకు చెందిన 1000 మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కూడా ఈ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. ఇక చైనా వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో నిర్మించగా, భారత్ అంతే సమయంలో ఏకంగా 10వేల పడకల ఆసుపత్రిని సిద్ధం చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/