గ్రామాల్లోనే పూర్తిస్థాయి ధాన్యం కొనుగోలు..సిఎం

ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి ధాన్యం కొనుగోలు ..అధికారులకు ఆదేశాలు

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: గ్రామాల్లోనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారని తెలంగాణ సీఎంవో తెలిపింది. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారని పేర్కొంది. ‘గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెలా పదిహేను రోజులపాటు సాగుతుంది, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై అంచనా వేసి, కొనుగోళ్లకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి’ అని సిఎం కెసిఆర్‌ అన్నారని సీఎంవో పేర్కొంది.

‘సాగునీటి సౌకర్యం క్రమంగా పెరుగుతుండటంతో పడావు పడ్డ భూములు కూడా బాగవుతూ, సాగులోకి వస్తున్నాయి. రైతుబంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగివచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరం అని సిఎం కెసిఆర్‌ అన్నారు’ అని తెలిపింది. బ్యాంకు గ్యారెంటీలు సహా రైతుల ధాన్యం అమ్మకం డబ్బు వెంటనే చెల్లించే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం ‌ అధికారులను ఆదేశించారని సీఎంవో వివరించింది. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పౌర సరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారని పేర్కొంది.

‘నిర్దేశిత పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు 10.78 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయడం అభినందనీయమని, ఆ పంటను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం కెసిఆర్‌ కెసిఆర్‌ సూచించారని సీఎంవో పేర్కొంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/