ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు మార్గదర్శకాలు

స్మార్ట్‌కార్డులతోనే ప్రయాణం

Will ensure people maintain social distance on Delhi Metro

న్యూఢిల్లీ: ఢిల్లీలో మెట్రో సెప్టెంబరు 7 నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్ వివరించారు. ఇకపై ప్రయాణికులందరూ డిజిటల్ విధానంలోనే ప్రయాణించాల్సి ఉంటుందని, ప్రయాణాలకు టోకెన్లు జారీ చేయబోమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా స్మార్ట్‌కార్డులు ఉపయోగించాలని, డిజిటల్ విధానంలో వాటిని రీచార్జ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవి, జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్ద శానిటైజర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ తర్వాత ప్రయాణికులను అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా స్మార్ట్‌కార్డులు ఉపయోగించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

కౌంటర్లు తెరిచే ఉంటాయని, స్మార్ట్‌కార్డులు, మెట్రోకార్డులను అక్కడ కొనుగోలు చేసుకోవచ్చన్నారు. మెట్రో ప్రాంగణంలో, కోచ్‌లలో మాస్కులు ధరించడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఒక్కో సీటుకు మధ్య మీటర్ దూరం ఉంటుందన్న ఆయన భౌతికదూరం నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. మెట్రో స్టేషన్లు, ఫ్లాట్‌ఫాంలు, మెట్రో కోచ్‌లలో రద్దీ లేకుండా సిబ్బంది చూసుకుంటారని, పోలీసులు, వలంటీర్లను కూడా మోహరిస్తామని మంత్రి కైలాశ్ పేర్కొన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి కంటైన్‌మెంట్ జోన్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండవని, క్లోజ్‌డ్ స్టేషన్లలో రైలు ఆగదని మంత్రి వివరించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/