కాంగ్రెస్‌ పగ్గాలు అందుకోవడంపై మల్లగుల్లాలు…

పీఠం ఎక్కేందుకు ముందుకు రాని నేతలు…
తెరపైకి గెహ్లాట్‌, ఎకె ఆంటోని, చిదంబరం పేర్లు…
పదవిలో ఎవరున్నా పెత్తనం గాంధీ కుటుంబానిదేనని భావిస్తున్న సీనియర్లు

Sonia Gandhi, Rahul Gandhi
Sonia Gandhi, Rahul Gandhi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి కాంగ్రెస్‌ ఇంకా బయిటపడలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ తన పట్టువిడవకపోవడంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న అంశంపై ఉత్కంఠ వీడటం లేదు. అప్పుడప్పుడూ కొన్ని పేర్లు తెరపైకి వచ్చి మాయమవుతున్నాయి. దీంతో కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తాన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో వృద్ధతరం, యువతరం మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ రాజీనామా చేసినా సీనియర్‌ నాయకులు మిన్నకుండటంపై యువనేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్లు తమ సంతానానికి టిక్కెట్లు కేటాయించాలని పట్టుబట్టడాన్ని సమీక్షా సమావేశంలో రాహుల్‌గాంధీ తప్పుపట్టిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబానికి చెందిన వారే పగ్గాలు అందుకోవాలని సీనియర్లు కోరుతున్నారు. కానీ రాహుల్‌గాంధీ అందుకు ససేమిరా అంటుండటంతో సమస్య జటిలమైంది.


పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన పివి, సీతారాం కేసరి….
రాజీవ్‌గాంధీ 1991లో కన్నుమూసిన తర్వాత పివి నర్సింహారావు పార్టీని నడిపించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొంతకాలానికి సోనియాగాంధీతో విభేదాలు ఏర్పడ్డాయి. 1998లో సారథ్య బాధ్యతలు సోనియాగాంధీ చేతికి వచ్చాయి. అప్పటి నుంచి పివికి కాంగ్రెస్‌ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో కనీసం చోటు లభించలేదు. 1996-98ల మధ్యకాలంలో పార్టీ అద్యక్షునిగా పనిచేసిన సీతారాం కేసరికి పార్టీకి వీర విధేయుడిగా పేరుంది. అయితే ఆయనను కూడా అవమానకరరీతిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఇవన్నీ గుర్తుకు వస్తుండటంతో తాజాగా పార్టీ అధ్యక్షుడిగా సారథ్యం వహించేందుకు ఇష్టపడటం లేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.


యువతరానికి మొండిచేయి….పెద్దలదే పెత్తనం….
కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో యువనేతలు జ్యోతిరాదిత్య సింథియా, సచిన్‌ పైలట్‌లు పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఈరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తీరా గెలుపు అనంతరం రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌కి సిఎం పదవి ఇచ్చారు. సచిన్‌ పైలట్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టారు. అదే మధ్యప్రదేశ్‌లో వృద్ధనేత కమల్‌నాథ్‌ను సిఎం పదవిలో కూర్చోబెట్టారు. సింథియాకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం పార్టీ వర్గాల్లో పలు చర్చలకు దారితీసింది. పార్టీలోని అన్ని విభాగాల్లో వృద్ధనేతలదే పెత్తనమన్న అంశం బహిరంగ రహస్యమే. మోతీలాల్‌ ఓరా, ఎకె ఆంటోని, గులాం నబీ ఆజాద్‌, దిగ్విజ§్‌ు సింగ్‌, ఊమెన్‌ చాందీ, కమల్‌నాథ్‌…తదితర నేతల ప్రాబల్యం ఎక్కువ. గతంలో సిడబ్ల్యుసిలో కొత్తవారిని తీసుకోవాలన్న రాహుల్‌ ప్రతిపాదనను వారు అడ్డుకున్నట్లు సమాచారం. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ వారికి చేరువ అయ్యేందుకు వీలుగా ప్రణాళికలు రచించడంతో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు. యువతరానికి మార్గదర్శకత్వం వహించాలని కోరుతున్నా ముందుకు రావడం లేదు.


పదవి తీసుకునేందుకు మొగ్గు చూపని సీనియర్లు…
1998 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబీకులే నిర్వహిస్తున్నారు. తాజాగా రాహుల్‌గాంధీ రాజీనామా చేయడంతో ఆస్థానంలో ఇతరులను నియమించాలని ఆయన సూచించినట్లు సమాచారం. గెహ్లాట్‌, చిదంబరం, ఎకె ఆంటోని…తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా ఆపదవిలో ఉన్నప్పటికీ పూర్తి సారథ్యం గాంధీ కుటుంబం చేతిలోనే ఉంటుందని లోక విధితమే. దీంతో పాటు పార్టీకి మంచి కాలం వచ్చినప్పుడు వారిని తొలగించిన తిరిగి గాంధీ కుటుంబమే పార్టీ సారథ్యాన్ని తీసుకుంటుంది. దీంతో సీనియర్లు ఆ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/