ఓటు వేసే ముందు ఆలోచించాలి

Voters
Voters (file)

ఓటు వేసే ముందు ఆలోచించాలి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మూడు రోజుల్లో జరగబోతున్నాయి. పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. గతంతో పోలిస్తే బిసిలకు పార్టీలు ఇచ్చిన సీట్ల విషయాలు కొంత వివక్షత ఉన్నా పోటీలో అక్కడక్కడా వివిధ బిసి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాజ్యాధికారం కావాలన్న బిసిల కల ఈనాటిది కాదు. మనదేశంలో బిసి జనాభా గణనలేక పోవడం చట్టసభల్లో స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బిసిలకు రాజ్యాధికారంలో వాటా దక్కలేదు. షెడ్యూల్‌ కులాలు, జాతులు, ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్‌ మినహా యించి మిగతా స్థానాలలో అగ్రకులస్థులదే ఆధిపత్యం. గ్రామాల్లో విద్యాసౌకర్యాలు లేక కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాలు తరాలే కుల వృత్తులలో జీవనం సాగించారు.

రాజకీయాల్లో సాధారణ ఓటర్లుగానే మిగిలిపోయారు. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా బిసిలకు సరైన అవకాశాలు ఇవ్వలేక సాంఘిక, రాజకీయ ఆర్థికరంగాల్లో క్రమక్రమంగా మార్పురావడం, బహుజన కులాల వారు విద్యారంగం వైపు రావడం, ఆయా రంగాల్లో రాణించడం ఇప్పుడిప్పుడే మొదలవ్ఞతుంది. దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలు తగ్గి వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా మొదలుకావడంతో కొత్త వారికి రాజకీయ అవకాశాలు దక్కనిపరిస్థితులు నెలకొంటున్నాయి.

1983 తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో యువకులకు, బిసిలకు, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌ ఎన్నికల్లో 33 శాతం బిసిలకు రాజకీయ రిజర్వేషన్‌ ప్రకటించి ఆనాడు ఎన్నికల్లో అప్పటివరకు అవకాశాలు దక్కని బిసి కులాలకు రాజకీయంగా ఎదిగే చారిత్రక సందర్భం ఆనాడు వచ్చింది. 1995లో 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్‌లు రావడానికి కారణం కూడా బిసిలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యమే కారణం. అనేక సందర్భాలలో బిసిలు పలు చోట్ల బ్రహ్మండమైన ఫలితాలు సాధించి చూపారు.

1983 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాల ఏర్పాటులో మార్పులలో బిసిల పాత్ర ఉందని గమనిస్తే అర్థమవ్ఞతుంది. దీనిని గమనించకుండా బహుజనులలో పెరుగుతున్న చైతన్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఈ రోజు బహుజన కులాలన్ని అంత గుడ్డివి కావ్ఞ. చక్కగా చదువ్ఞ కుంటున్నారు. సమాజంలో తమ పరిస్థితి ఏమిటో బేరీజు వేస్తున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం ఇచ్చిన పార్టీల వైపు సంస్థలవైపు వారు ఉంటారు.

లేదంటే అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా మొదలు పెడతారు. ఈ విషయాన్ని ప్రధాన పార్టీలు గుర్తిస్తే మంచిది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే రెండు బలమైన అగ్ర కులాల మధ్యపోరుగా చిత్రీకరించే పరిస్థితులు, వాస్తవాలు కనబడుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఆ సమయంలోనే ఏ ‘భౌగోళిక తెలంగాణా- బహుజన తెలంగాణా అన్న నినాదం వినిపించింది. కాని తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్గాల ఆధిపత్యం అన్ని రంగాలలో పెరిగిపోతున్నది.

తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా క్రియాశీలకంగా పాల్గొన్నది ప్రతి పోరాటంలో రాజకీయ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపులో ఉద్యమ స్ఫూర్తిని నిజాయితీగా ప్రదర్శించి నిలిచింది సబ్బండ ప్రజలే! నేడు భౌగోళిక తెలంగాణాలో సబ్సిడీలు మాత్రమే కాదు సాధికారికత దక్కాలి అంటున్నాయి. ఇప్పటి వరకు చట్టసభలలో చోటు దక్కని కులాలకు సాధికారత దక్కని వర్గాలకు ప్రత్యేక రాష్ట్రంలో ప్రాతినిధ్యం దక్కాలి. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులో బిసి అభ్యర్థులు కులాలన్నీ ఏకమై ‘బలహీన అభ్యర్థి కాదని బలహీన వర్గాల అభ్యర్థి బడుగు వర్గాల ప్రతినిధిగా ప్రకటించి గెలిపించి చట్టసభలకు గర్వంగా పంపాలి.

వెనుక బడిన కులాలు అభివృద్ధిచెందాలంటే ఏ కులానికి ఆ కులం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కాకుండా ఐక్యతతో వ్యవహరించాలే. కులాల మధ్యఐక్యత కాకుండా సాధికారికత సాధ్యం కాదనే విషయం గుర్తించాలి.బిసిలు తమ ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలంటే తమతోపాటు తమతోటి బీసీ కులాల్ని బహుజన వర్గాలన్ని కలుపుకున్న నాడే సాధికారికత లభిస్తుందని గుర్తెరగాలి. బహుజనులు దీనిని గుర్తించిన పార్టీలకే భవిష్యత్‌లో మనుగడ ఉంటుందని గమనించాలి. ఓటు వేసే ముందు ఆలోచించండి. అత్యధిక శాతం ఉన్నవర్గాలను అత్యధికంగా చట్టసభలకు పంపే ప్రయత్నాలు చేద్దాం.

– స్నేహితగుణ