రాములమ్మ డేరింగ్ డెసిషన్

Vijaya shanti, Mahesh babu
Vijaya shanti, Mahesh babu

విజయశాంతి త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ ముఖ్య పాత్రను ఆమె పోషించబోతున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ‘‘కిలాడి కృష్ణుడు నా మొదటి సినిమా. ఆ సినిమాకి ముందు సుమారు తొమ్మిది సినిమాలు నేను తమిళ్ లో చేశాను. అయినా కృష్ణ గారి కాబినేషన్ గా నా నటనా ప్రస్థానంలో ప్రాముఖ్యత ఇప్పటికి కలిగి ఉంటూనే ఉంది ఆ చిత్రం.
180 పైన తెలుగు – తమిళ్ – కన్నడ – మలయాళం – హిందీ సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ అదే గౌరవం అంకితభావం సినిమా పట్ల కళాకారిణిగా నా విధానం. సినిమాల నుండి కొంత లేదా కొంత ఎక్కువ విరామం తరువాత మహేష్ బాబు గారి సినిమా కాంబినేషన్లో తిరిగి మరొకసారి ఆర్టిస్ట్గా నా ప్రజల ముందుకు రానున్నాను. దైవ సంకల్పమో దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో ఈ నిర్ణయం తీసుకున్నాను. బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే తెలిసిన మీ రాములమ్మ’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేసిన సంగతి విధితమే.
ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానిపై స్పష్టత అయితే రాలేదు కానీ – ఇందులో విజయశాంతి తన మార్క్ చూపించబోతున్నారని తెలుస్తోంది. దీనికి కారణం తాజాగా బయటికొచ్చిన వార్తే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం విజయశాంతి ఎన్నో కసరత్తులు చేస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. ఈ సినిమా కోసం ఆమె ఎక్కువ సమయం జిమ్లో గడుపుతున్నారని తెలిసింది. రీ ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటికొచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో పాత విజయశాంతిని చూడొచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు.
‘మహర్షి’ తర్వాత మహేశ్ చేయబోతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ‘మహర్షి’ లానే ఈ సినిమాను కూడా ముగ్గురు నిర్మాతలు (దిల్ రాజు – మహేశ్ – అనిల్ సుంకర) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడని విశ్వసనీయంగా తెలిసింది.