ఉత్తర కొరియా దుర్భర పరిస్థితిపై యూఎన్‌ నివేదిక

అక్కడ బతకాలంటే లంచం ఇవ్వాల్సిందే..
అధికారులకు లంచాలు
యూఎన్‌ నివేదికను ఖండించిన నార్త్‌ కొరియా

north korea
north korea

జెనీవా: ఉత్తర కొరియాలో ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ ప్రజల ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రం. కనీసావసరాలు తీర్చుకునేందుకు దిక్కులేని పరిస్థితి. అక్కడ కిమ్‌ ప్రభుత్వం ఆదుకోకపోగా మరింత వేధిస్తుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నార్త్‌ కొరియాలో నెలకొన్న పరిస్థితులపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి.
ఉత్తరకొరియా అవినీతితో నిండిపోయిందని, అణచివేత సాధారణమని యూఎన్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. శిక్షిస్తామని, జైల్లో పెడతామని బెదిరించి కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజల నుంచి కూడా అక్కడి అధికారులు దోపిడి చేస్తున్నారని తెలిపింది. ది ప్రైస్‌ ఈజ్‌ రైట్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక పేదరికం, అవినీతి, అణచివేత వలలో చిక్కుకున్న ప్రజలు విలవిల్లాడిపోతున్నారని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అక్కడ 10 మిలియన్ల మంది ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. అత్యంత దుర్భరమైన కరువు నేపథ్యంలో ప్రజలపై మరిన్ని ఆంక్షలు పెట్టే అవకాశముందని యూఎన్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది.
దేశజనాభాలో నాల్గింట మూడొంతుల మంది బ్లాక్‌ మార్కెట్‌లో సరుకులు కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగి ఐనా నెలలో కడుపు నిండా తినే పరిస్థితి లేదు. జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేయక తప్పదు. ఐతే అలా పని చేస్తున్నందుకు కూడా అధికారులకు లంచం చెల్లించాల్సిందేనని యూఎన్‌ రిపోర్టు చెబుతుంది. 214 మందిని ఇంటర్వ్యూ చేసి మానవ హక్కుల సంఘం ఈ నివేదిక రూపొందించింది.
ప్రజలు పడుతున్న కష్టాల గురించి మానవ హక్కుల సంఘం రూపొందించిన నివేదికను నార్త్‌ కొరియా తోసిపుచ్చింది. రాజకీయంగా ప్రభావితమై ఈ రిసోర్టు తయారు చేశారని ఆరోపించింది. వారికి అవసరమైన నిధులు పొందేందుకు కొంత మంది ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఇలాంటి రిపోర్టులు తయారు చేస్తారని ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/