జీ7 కూటమిలోకి భారత్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయం

g7 summit

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన ‘జీ7’లో భారత్‌కు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జి7 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలైన ఈ ఏడు దేశాల కూటమిలో భారత్‌ను కూడా చేర్చుకోవాలని ఆయన అభిలషిస్తున్నారు. భారత్‌తో పాటు మరో 3 దేశాలను కూడా చేర్చుకుని జి11 మహాకూటమిగా ఏర్పడాలని ఆయన సూచించారు. జూన్‌ ఆఖరులో జరగాల్సిన జి7 భేటీని సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి కూటమి కాలం చెల్లిన గ్రూపు అని.. భారత్‌, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను కూడా చేర్చుకుని దానిని విస్తరించాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. చైనాను ఎదుర్కోవడానికి సంప్రదాయ మిత్ర దేశాలన్నీ ఏకం కావాలని చెప్పారు. తొలుత ఆయన రష్యా పేరు చెప్పలేదు. తర్వాత విలేకరులతో ఆఫ్‌ది రికార్డుగా మాట్లాడుతూ రష్యా పేరును గట్టిగా సూచించారు. అయితే ఈ కూటమి సమావేశం ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. కాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు సెప్టెంబరు 15న ప్రారంభమై 22న ముగుస్తాయి. వాటికి వివిధ దేశాధినేతలు హాజరవుతారు. ఆ సందర్భంగానే కూటమి భేటీ ఏర్పాటు చేయాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/