వైట్ హౌస్ వద్ద కాల్పులు..

సగంలోనే ఆగిన ట్రంప్ మీడియా సమావేశం

Donald Trump evacuated after shooting outside White House

వాషింగ్టన్‌ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. వైట్‌హౌజ్ బ‌య‌ట కాల్పులు జ‌రిగాయి. దీంతో అధికారులు ఆ మీడియా స‌మావేశాన్ని అర్ధాంత‌రంగా ముగించారు.  ట్రంప్ స‌మావేశం నుంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. కాల్పుల ఘటన తెలియగానే ఎస్కార్ట్స్ బృందం, ట్రంప్ ను చుట్టుముట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లింది. కాగా, జరిగిన ఘటనపై వాషింగ్టన్ డీసీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి డౌగ్ బుచానన్ వివరణ ఇస్తూ, “సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో సీక్రెట్ సర్వీస్ విభాగం నుంచి ఓ ఫోన్ వచ్చింది. సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఓ వ్యక్తిని శరీరం పైభాగంలో కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆ వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు.

మొత్తం ఘటనపై తదుపరి ట్రంప్ కూడా వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి వద్ద ఆయుధం ఉందని, నిషేధిత ప్రదేశంలోకి ఆయుధంతో రావడమే ఈ ఘటనకు దారి తీసిందని స్పష్టం చేశారు. బయట జరిగిన ఘటన గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో ఎటువంటి ఆయుధాలనూ రికవరీ చేయలేదని విచారణ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. ఇక ఈ కాల్పులపై స్పందించేందుకు సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి జూలియా మెక్ ముర్రే తిరస్కరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/