ఫెడ్‌ యూటర్న్‌? వారెవ్వా..యుఎస్‌!

Jerome Powell
Jerome Powell

వాషింగ్టన్‌: వాణిజ్య వివాదాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తగిన విధంగా స్పందించనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ తాజాగా తెలిపారు. దీంతో ఇప్పటివరకూ వడ్డీరేట్ల పెంపు బాటలో సాగుతున్న కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఇకపై రేట్ల కోతవైపు దృష్టిసారించనున్నట్లు అంచనాలున్నాయి. దీనికితోడు ఫెడ్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ బుల్లార్డ్‌ కూడా త్వరలో రేట్ల తగ్గింపునకు అవకాశం ఉన్నట్లు తెలియడంతో ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లయింది. ఒక్కసారిగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. డోజోన్స్‌ 512పాయింట్లు పెరిగి 25,332కు చేరగా, ఎస్‌అండ్‌పి 59 పాయింట్లు పెరిగి 2,803వద్ద నిలిచింది.

నాస్‌డాక్‌ మరింత అధికంగా 194 పాయింట్లు పెరిగి 7,527వద్ద నిలిచింది. వెరసి ఒకేరోజులో గత ఐదు నెలల్లోలేని విధంగా అత్యధిక లాభాలు సాధించాయి. సోమవారం వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న ఆందోళనలతో నీరసిస్తూ వచ్చిన బాండ్ల ఈల్డ్స్‌ ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం 20 నెలల కనిష్టం 2.06శాతాన్ని తాకిన ట్రెజరీ ఈల్డ్స్‌ 4.5బేసిస్‌ పాయింట్లు పెరిగి 2.126కు చేరాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది. సోమవారం పతనబాటలో సాగిన టెక్‌ దిగ్గజాలు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌ రెండు శాతం చొప్పున పుంజుకున్నాయి. ఈ దారిలోనే నెట్‌ఫ్లిక్స్‌ 5 శాతం పెరిగింది.

ఇతర షేర్లలో ఉబెర్‌ టెక్నాలజీస్‌ 3.6శాతం, సీవిఎస్‌ హెల్త్‌కార్ప్‌ 2.3శాతం చొప్పున పుంజుకున్నాయి. కొత్తగా 1.1కోట్ల షేర్లను జారీచేయనున్న వెంటాస్‌ ఇంక్‌ మూడు శాతం నీరసించింది. మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.5శాతం నుంచి 1.5శాతం మధ్య పెరిగాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌ 1.8 శాతం పెరగ్గా, హాంకాంగ్‌, చైనా, థా§్‌ులాండ్‌, తైవాన్‌ 0.7శాతం 0.4శాతం మధ్య పుంజుకున్నాయి. కొరియా నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. మిగిలిన మార్కెట్లో ఇండొనేషొయా, సింగపూర్‌ మార్కెట్లు ప్రారంభంకాలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/