తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం

9.50 లక్షల మందికి చెందిన 55 లక్షల పత్రాల మూల్యాంకనం

paper-evaluation

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కాలేజీలో కేంద్రంలో సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ముందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పేపర్లను దిద్దుతారు. అనంతరం మొదటి సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది.

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం జరగనుంది. మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులకు చెందిన 55 లక్షల జవాబు పత్రాలను 15 వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేస్తారు. విధుల్లో పాల్గొనే లెక్చరర్లకు రవాణా, వసతి సదుపాయాలు కల్పించారు. పోలీసు పాస్‌లను కూడా అందజేశారు. జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు ప్రకటించే అవకాశముంది. కాగా కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉండడంతో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కి పెంచారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇంటర్‌బోర్డు మూల్యాంకన కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు భౌతికదూరం పాటిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/