నేటి నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

బిల్లులు ఆమోదం కోసం ప్రభుత్వ యత్నం

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్‌ రెండో విడుత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో వ్యవహరించిన వ్యూహాలను అధికార, ప్రతిపక్షాలు రచిస్తున్నాయి. ఇటీవలి ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మతోన్మాద హింస, దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. అలాగే బడ్జెట్‌ (డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌)పై రెండో దశ చర్చ జరుగుతుంది. 33 రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో 22 రోజుల పాటు సభా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. 11 రోజులు పార్లమెంట్‌కు సెలవుగా ఉండొచ్చు. సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశాల్లో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లుపైన చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రశ్నలు సంధించేందుకు ప్రతిపక్షాలు యోచిస్తోన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.

ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 28 కొత్త బిల్లులను ఆమోదం కోసం తీసుకురానున్నది. సరోగసి, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్ట సవరణ బిల్లు వంటి బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. మెడికల్‌ ట్రెమిషన్‌ ఆఫ్‌ ప్రెగన్సీ (సవరణ) బిల్లు, సీడ్స్‌ బిల్లు, పెస్టిసైడ్స్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు, బంగారు నిక్షేపాలను విదేశీ వాణిజ్య బ్యాంకులు (ఎఫ్‌సిబి), ఏదైనా ఆర్థిక సంస్థలతో ఉంచడానికి అనుమతించే ఆర్‌బిఐ (సవరణ) బిల్లు, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెడిసన్‌ అండ్‌ హోమియోపతి బిల్లు, కంపెనీస్‌ (రెండో సవరణ) బిల్లు, ఆర్థిక ఒప్పందాల బిల్లు, నేషనల్‌ పోలీస్‌ యూనివర్శిటీ బిల్లు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీ బిల్లు, బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ చట్ట సవరణ తదితర కొత్త బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 17 బిల్లులను కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/