రాజీనామాపై పట్టువీడని రాహుల్‌!

పదవులు వదులుకుంటున్న పిసిసి అధ్యక్షులు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాభవం కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తుంది. పరాజయానికి నైతిక బాధ్యత వహించి ఎఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్‌ను నేతలు వారిస్తున్నా ఆయన పట్టువీడడం లేదు. సోమవారం నాడు జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ పంజాబ్‌, ఝార్ఖండ్‌, అసోం పిసిసి అధ్యక్షులు సునీల్‌ జాకర్‌, అజ§్‌ుకుమార్‌, రిపున్‌ బోరాలు రాజీనామాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం లక్ష్యంగా విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్‌ 542 లోక్‌సభ స్థానాల్లో 52 మాత్రమే గెలవగలిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్‌ శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సిడబ్లూసి) సమావేశంలో ప్రకటించారు. దీన్ని పార్టీ నేతలు తిరస్కరించారు. సీనియర్లు నచ్చజెప్పినా రాజీనామను ఆమోదించాల్సిందేనంటూ రాహుల్‌ పట్టుబడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు కొత్త సారథి కావల్సిందేనని, అది కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి ఉండాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారని సమాచారం. రాహుల్‌ నిర్ణయం మార్చుకోకుంటే సోనియా లేదా ప్రియాంకను పార్టీ అధ్యక్ష పదవికి నేతలు ప్రతిపాదిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/