ప్రధాని మోడికి శుభాకాంక్షల వెల్లువ

మోడి దేశానికి గొప్ప సంపదన్న తమిళిసై

pm modi
pm modi

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి 70వ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖు‌లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ప్రధాని మోడికి జన్మదిన శుభాకాంక్షలు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోడికి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌, సిఎం కెసిఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి ఆయన గొప్ప సంప‌ద‌ అని తమిళిసై అన్నారు. భారత్‌కు మోడి మ‌రిన్ని గొప్ప సేవ‌లు అందించాల‌ని కోరుకుంటున్నట్లు కెసిఆర్ తెలిపారు.

‘ప్రధాని మోడికి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు దేశానికి మరిన్ని ఏళ్లపాటు సేవలు అందించేందుకు మీకు దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అని సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోడికి మా నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

‘మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోడి గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోడి గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని సినీనటుడు మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

‘భారతమాత ఖ్యాతిని ఖండాంతరాల వరకూ విస్తరింపజేస్తూ, నవభారత నిర్మాణంలో నిత్య కృషీవలుడిగా, సుదీర్ఘకాల సమస్యలను సున్నితంగా పరిష్కరించిన సుసాధ్యుడు, భారత మాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధాని శ్రీ.నరేంద్ర మోడి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/