‘క్యాబ్‌’పై ఎగిసిపడుతున్న నిరసనలు

అసోంలో హింసాత్మకం… పోలీసుల లాఠీచార్జ్‌

protests
protests

గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌)కు వ్యతిరేకంగా ఈశాన్య భారతం ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతోంది. ప్రజాందోళనలను అణిచేవేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సైనిక బలగాలను తరలిస్తోంది. దాదాపు 5000 మంది సైనికులను పంపాలని నిర్ణయించింది. వీరిలో ఇప్పటికే రెండు వేలమంది ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. అస్సాం తదితర రాష్ట్రాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. మరోవైపు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో రహదారులపైకి వచ్చి మూడో రోజూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా అసోం, త్రిపుర రాష్ట్రాల్లో నిరసనకారుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. పలుచోట్ల నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు.

బిజెపి పాలిత అసోం రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనకారులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. టైర్లను తగలబెట్టారు. కాగడాల ప్రదర్శన లను నిర్వహించారు. డిస్పూర్‌, గువహతి, దిబ్రూగఢ్‌, జోర్హట్‌ లలో భారీ సంఖ్యలో వున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీచార్జ్‌ చేసింది. ఈ ఘటనలో 25 మంది జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. ఈ సందర్భంగా వందలాది మంది నిరసనకారులను పోలీసులు నిర్బంధించినట్టు సమాచారం. మరోపక్క, రైల్వే సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది. దాదాపు 14 రైళ్లను రద్దు, దారి మళ్లించడం వంటివి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కాగా ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పించే ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను సోమవారం లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బిల్లు పెద్దల సభ ఆమోదం కూడా పొందింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/