ఏశాట్‌ ప్రయోగం మంచిదే: పెంటగాన్‌

A-SAT
A-SAT


వాషింగ్టన్‌: భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏ శాట్‌) ప్రయోగాన్ని రక్షణ విభాగం పెంటగాన్‌ మరోసారి సమర్ధించింది. భవిష్యత్‌లో అంతరిక్షంలో ముప్పు జరుగుతుందనే ముందుగా ఊహించి భారత్‌ ఏశాట్‌ ప్రయోగం చేపట్టాల్సి వచ్చిందని పెంటగాన్‌ వెల్లడించింది. అంతరిక్షం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వారిలో ఉంది. దాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉండాలన్న భావనతోనే వారు ఈ ప్రయోగం చేపట్టారు అని అమెరికా స్ట్రాటజిక్‌ కమాండర్‌ జనరల్‌ హైటెన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ ఎందుకు ఏ శాట్‌ ప్రయోగం చేయాల్సి వచ్చిందో ఆయన సవివరంగా చెప్పారు.
అంతరిక్షంలో వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని అంతర్జాతీయ నిబంధనలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని హైటెన్‌ అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో శకలాల ముప్పు తీవ్రమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చైనా నిర్వహించిన ఓ ప్రయోగం వల్ల అనేక వ్యర్ధాలు వెలువడ్డాయని అవి ఇప్పటికీ కక్ష్యలోనే ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. 2009లో అమెరికాకు చెందిన ఒక యాక్టివ్‌ ఉపగ్రహాన్ని రష్యాకు చెందిన ఓ పనిచేయని ఉపగ్రహం ఢీకొట్టిందని తెలిపారు. ఇలాంటి ఘటనలతో శకలాల ముప్పు మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాలు సామర్ధ్యం పెంపులో భాగంగా ఇలాంటి ప్రయోగాలు చేపడితే అంతరిక్షాన్ని సమర్ధంగా వినియోగించుకోవడంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/