ఉగ్రవాదం పాక్‌ డిఎన్‌ఏలోనే ఉంది

UNESCO
UNESCO

ప్యారిస్‌: కశ్మీర్‌ అంశంలో భారత్‌పై విషం చిమ్ముతూ అంతర్జాతీయ వేదికలపై రాజకీయం చేయాలని చూస్తుందని భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ అన్నారు. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదం పాకిస్థాన్‌ డిఎన్‌ఏలోనే ఉందని భారత ప్రతినిధి పాక్‌ ప్రతినిధులను కడిగిపారేశారు. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం లాంటి చీకటి కోణాలకు పాక్‌ అడ్డాగా మారిందని గుర్తుచేశారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఒసామా బిన్‌ లాడెన్‌, హక్కాని నెట్‌వర్క్‌ లాంటి వారిని ఇటీవల పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్‌ హీరోలుగా అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేసి పాక్‌ నిజస్వరూపాన్ని సదస్సులో బట్టబయలు చేశారు. అణు యుద్ధం, ఇతర దేశాలపై ఆయుధాలు ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐరాస సభలను దుర్వినియోగం చేసిన ఘనత ఒక్క పాకిస్థాన్‌ ప్రధానికే దక్కిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇలాంటి విపరీత పోకడలే దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయని అనన్య ఆరోపించారు. అలాగే పాక్‌లో మహిళలపై, మైరారిటీ వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని ఆమె ఈ సందర్భంగా సదస్సుకు వివరించారు. ఇలాంటి అత్యున్నత వేదికల్ని రాజకీయం చేయడాన్ని ఏ సభ్యదేశాలు సహించకూడదని అనన్య అగర్వాల్‌ పిలుపునిచ్చారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/