చైనా వైఖరిపై ఇతర సభ్య దేశాల అసంతృప్తి

China Flag
China Flag

అసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించాయి
ఇదే వైఖరి కొనసాగితే బాధ్యతాయుతమైన సభ్యదేశాలుగా

వాషింగ్టన్‌: ‘ జైష్‌ ఎ మహమ్మద్‌’ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకున్న వైఖరిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ( యూఎన్‌ఎస్‌సీ) లో ఇతర సభ్య దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదే వైఖరి కొనసాగితే బాధ్యతాయుతమైన సభ్యదేశాలుగా అజార్‌ అంశంలో ఇతర దేశాలు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించాయి. చైనా వైఖరి దక్షిణాసియాలో ప్రాంతీయ సుస్థిరతకు విఘాతమని అభిప్రాయపడ్డాయి. ఈ వివరాలు మీడియాకు వెల్లడించిన ఓ దేశ రాయబారి తమ పేరు బయటపెట్టడానికి, యూఎన్‌ ఆంక్షల కమిటీలో ఏం చర్చించిందీ పూర్తి వివరాలు వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను రక్షించడానికి తరచూ చైనాపై ఆధారపడుతోందని పాకిస్థాన్‌ను మరో దేశ రాయబారి తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థగా జైష్‌ ఎ మహ్మద్‌గను ప్రకటించిందని, అలాంటి సంస్థ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవడం సమర్థనీయం కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత ఫిబ్రవరి 27న అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్తంగా యూఎన్‌ఎస్‌సీగలో ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు చైనా బుధవారం మోకాలడ్డింది. ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. వాస్తవానికి అభ్యంతరం వ్యక్తం చేయడానికి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉంది. సరిగ్గా గంటముందు చైనా మోకాలడ్డింది. దీంతో మరో ఆరు నెలలవరకు దీన్ని యూఎన్‌ఎస్‌సీలో ప్రవేశపెట్టడం కుదరదు. ఈ తరువాత కూడా ఏ సభ్యదేశమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో మూడునెలల వరకు పొడిగిస్తారు.

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/