ఉభయ రంగాల్లో సాటిలేని ఎన్టీఆర్‌

నేడు ఎన్టీరామారావు వర్థంతి

NT RAMA RAO (File)

సినీ, రాజకీయ రంగాలలో వారసత్వం లేదు,అనుభవం లేదు.అయినా సినీరంగంలోరారాజు, ఆయన ధరించి మెప్పించని పాత్ర లేదు.చేరని నటతీరాలు లేవ్ఞ. అధి రోహించని నటశిఖరాలు లేవు. 1982 నాటికి 35 సంవత్సరాలు గా ఏకధాటిగా అధికారంలో ఉన్న కాంగ్రెసును మట్టికరిపించి,

కేవలం 9 నెలల్లో పార్టీని స్థాపించి, అధికారం హస్తగతం చేసుకున్నారంటే ఎంతటి నిబద్ధత, కార్యదీక్ష, పట్టుదల, పోరాట పటిమ, ఆత్మాభి మానం,ఆవేశం, ఆక్రోషం, ఉద్రేకం, ఉద్వేగం అన్ని కలబోసుకున్న నాయకుడే నందమూరి తారకరామారావ్ఞ. ఎన్టీరామారావ్ఞ కృష్ణా జిల్లాలోని 500 జనాభా గల నిమ్మకూరు అనే కుగ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మగార్లకు ప్రథమ సంతానంగా 1923 మే 28న జన్మించారు. నిమ్మకూరులో ఐదోవ తరగతి వరకు చదవి, విజయవాడ వన్‌టౌనులో గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేసి, సి.వి.ఆర్‌ కాలేజీలో ఇంటర్‌లో చేరారు. కాని కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్షీణించ డంతో మధ్యలో కుటుంబాన్ని ఆదుకోవాలని రకరకాల ఉద్యోగాలు, వర్తకాలు చేసినా కోలుకోలేకపోయారు. 1942లో రెండు పరిణా మాలు జరిగాయి.

ఒకటి నాటక రంగప్రవేశం, రెండవది మేన మామ కూతురుతో వివాహం. తరువాత చదువ్ఞ అబ్బలేదని బంధు మిత్రులు హేళనచేయడంతో ఇంటరు పూర్తి చేసి, గుంటూ రు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ పూర్తి చేశారు. ఇక్కడే విరివిగా నాటకాలు వేయడం, సినీ నటులకు సంబంధించిన జగ్గయ్య, ముక్కామల లాంటి వారితో పరిచయాలు కలగడం జరిగింది. డిగ్రీ చదువ్ఞతున్న సమయంలోనే క్రమశిక్షణ, పట్టుదల అలవడ్డాయి. డిగ్రీ పూర్తి అయిన వెంటనే మంగళగిరిలో సబ్‌-రిజిస్ట్రారు ఉద్యో గంలో చేరారు. విచిత్రమేమిటంటే అంత మంచి ఉద్యోగం వదులు కొని మద్రాసు పయనం అయ్యారు. సినిమా వాళ్ల పరిచయంతో ‘మనదేశం సినిమాలో వేషం వేయడంతో 1949లో సినిమా రంగ ప్రవేశం జరిగింది. అప్పటికే తెలుగు సినిమా రంగంలో సి.హెచ్‌ నారాయణరావ్ఞ, చిత్తూరు నాగయ్య, అప్పుడప్పుడే హీరోగా స్థిరపడుతున్న అక్కినేని నాగేశ్వరరావ్ఞలే హీరోలుగా ఉన్నారు.

పది, ఇరవై మంది నటీనటులతో పాటు హీరో అనేదే తప్ప హీరో యిజం ఉండేదికాదు. 1950లో విడుదల అయిన ‘పాతాళభైరవి సినిమా మూడు రికార్డులను సృష్టించింది. ఒకటి మొట్టమొదటి శతదినోత్సవ చిత్రం. రెండవది చిత్రంలోని పాటలు అందరూ పాడుకునేవిగా ఉండటం, మూడవది కథ మొత్తం హీరోచుట్టూ ఉండటం చేత, రామారావ్ఞ రాకుమారుడుగా అద్భుతంగా నటిం చడం చేత హీరోయిజం అప్పటినుండే మొదలైంది.తర్వాత ‘మల్లే శ్వరి ‘మిస్సమ్మలాంటి చిత్రాలతో ఎన్టీఆర్‌ ఉన్నత నటశిఖరాలకు చేరుకున్నారు.

ఇక మాయా బజార్‌,లవకుశ, సినిమాలతో భారత దేశంలోని ఇతిహసప్రియులు, భక్తులు ఆయనలో కృష్ణున్ని, రాము న్ని చూసుకున్నారు. అభిమానులందరికి దేవుడయ్యారు. అంతే కాకుండా విచిత్రమైన వేశాలు ధరించి, వినూత్న ప్రయోగాలు చేయడం ఎన్టీఆర్‌కు వెన్నెతో పెట్టిన విద్య. ‘నర్తనశాలలో విచిత్ర మైనపాత్ర,భూకైలాస్‌, సీతారామ కళ్యాణం, దానవీరశూరకర్ణలలో ప్రతి నాయకుని పాత్ర లు పోషించి మెప్పిం చడం మరెవరికైనా సాధ్యమా? అంతే కాకుండా ముప్ఫైఏళ్ల వయసులో తొంభైఏళ్ల భీష్మపాత్ర, రాజూ పేదలో బీదవాడి పాత్రలు వేయడం ఆయనకే చెల్లింది.

నటనే కాకుండా పౌరాణిక పాత్రల రూపకల్పనలో, దర్శకత్వం ఎంతో ప్రావీణ్యం కనబరిచేవారు.పౌరాణిక పాత్రలు,ముఖ్యంగా రాముడు, కృష్ణుడి పాత్రలు ధరించేటప్పుడు ఎన్టీఆర్‌ ఎంతో నియమనిష్టలతో ఉండేవారట. రెండు రంగాలలో ఆయన ఎప్పుడూ, ఎక్కడ కూడా కుల మతాల్ని, ప్రాంతీయతలను కనబరిచేవారు కాదు. ఇక రెండవ రంగం రాజకీయం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1982 వరకు మనం కాంగ్రెసు పరిపాలనలోనే ఉన్నాం. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత రాష్ట్రపరిపాలనా వర్గాలు ఢిల్లీలో ఉండేవి. కాంగ్రెసు కార్యకర్తలు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేసిలు, మంత్రులు ముఖ్యమంత్రి ఢిల్లీకి పరుగులు తీసేవారు. ఎందుకు! రాష్ట్రాభివృద్ధికా కాదు! ఒకరి మీద ఒకరు అధిష్టానానికి చాడీలు చెప్పుకోడానికి. తెలుగు వాళ్ల ఆత్మాభిమానం ఢిల్లీ నాయకుల చెప్పుల కిందకు చేరింది.

ఇటువంటి పరిస్థితుల్లో 60ఏళ్లు నిండినా కూడా సినీరంగంలో డిమాండులో ఉన్న రామారావ్ఞ సంపాదనను వదులుకొని పార్టీని స్థాపించి 9 నెలల్లో కాంగ్రెసును మట్టికరిపించి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖానికి రంగు వేసుకునేవాడికి రాజకీయాలెందుకు అన్నవాళ్లు తలలు దించుకున్నారు. నేషనల్‌ఫ్రంట్‌ను స్థాపించి, విజయవాడ నగరం నడిబొడ్డున తొమ్మిది మంది మంత్రులను నిలబెట్టి, తనంటే ఏంటో తెలుగువాడి ఆత్మాభిమానం, పౌరుషం, వాడి,వేడిని ఇందిరాగాంధీకి, ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్‌.టి.ఆర్‌. బడుగు, బలహీనవర్గాల కోసం రెండు రూపాయల కిలో బియ్యంపథకం ప్రవేశపెట్టారు.

తాలూకాలను రద్దు చేసి, ప్రజల ముంగిట పాలన కోసం మండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. బీదలను దోచుకుంటున్న, భూములను ఇష్టం వచ్చిన వారి పేర్లపై చేసే పట్వారిలను, పటేళ్లను కరణాలను రద్దు చేసి బలహీనవర్గాల బాంధవ్ఞడయ్యారు. పట్టుదలతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో, సమయం పాటించడంలో ఎన్టీఆర్‌కు సాటిరారు మరెవ్వరూ. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, కాంగ్రెసు, టిఆర్‌ఎస్‌, వైసిపి, కాంగ్రెస్‌లలో ఉన్నవాళ్లు చాలామంది ఎన్టీఆర్‌ రాజకీయ సహకారం పొందినవారనడంలో సందేహం లేదు. రామారావ్ఞ రాజకీయాలలోకి రాకపోయి ఉంటే వాళ్ల రాజకీయ ప్రస్తానం ఊహించి ఉండేవాళ్లేకారు. ఈ రోజులలో కోట్లు ఖర్చుపెట్టి యజ్ఞయాగాదులు చేస్తున్నారు.

గుళ్లు, గోపురాలు కడుతున్నారు. ప్రజల్లో భక్తిభావం పెంపొందిస్తున్నాం అని అంటున్నారు.మరి ఎన్టీఆర్‌ అభినయించిన పౌరాణిక పాత్రల వల్ల ప్రజలలో అజరామరమైన భక్తిభావం వెళ్లివిరిసింది. అందుకుగాను మనం అప్పట్లో సినిమాకు ఖర్చుపెట్టింది రెండు మూడు రూపాయలు మాత్రమే. సూర్యచంద్రులు ఉన్నంతకాలం మన రామాయణ, భారతాలు ఉంటాయి. అవి మన మనసులో ఉన్నంతకాలం రామారావ్ఞ నటించిన రామ,కృష్ణ లాంటి పౌరాణిక పాత్రలు మన మదిలో కదలాడుతూనే ఉంటాయి.

మునిగంటి శతృఘ్నాచారి
(రచయిత: కార్యదర్శి బి.సి.సంఘం, తెలంగాణ రాష్ట్రం)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/