కిరాతక చర్యలు చేపడుతున్న కిమ్‌!

ట్రంప్‌తో చర్చలు విఫలమైనందుకు ఐదుగురికి మరణశిక్ష

kim jang unn
kim jang unn, north korea president

సియోల్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన రెండు విడతల చర్చలు విఫలమైనందున ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ దానికి కారణమైన ఐదుగురు ఉన్నతాధికారులను కాల్చిచంపించినట్లు సమాచారం. ట్రంప్‌తో తన హనోయి ద్వైపాక్షిక భేటి విఫలమవడానికి కారకులంటూ ఐదుగురు ఉన్నతాధికారులకు మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియాకు చెందిన దినపత్రిక ఒకటి కథనం రాసింది. ఇందులో అమెరికాతో చర్చలకోసం అన్నీ తానై వ్యవహరించి స్వయంగా ప్రత్యేక రైల్లో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను తీసుకెళ్లిన ఉత్తరకొరియా రాయబారి కిమ్‌ హ్యోక్‌ చోల్‌ కూడా ఉన్నారు. మిగతా నలుగురు ఉన్నతాధికారుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కిమ్‌తో చర్చల సమయంలో ట్రంప్‌కు తన తమ ప్రతిపాదన వివరించి చెప్పడంలో ఒక్క ఆంగ్ల పదం తప్పుగా పలికిన మహిళా దుబాసి షిన్‌ హై యాంగ్‌ని జైలుకు పంపించాడు. చర్చల సందర్భంగా అమెరికా తరఫు ప్రత్యేక ప్రతినిధిగా స్టీఫెన్‌ బీగన్‌, ఉత్తర కొరియా తరఫున చోల్‌ వ్యవహరించారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో స్పందించారు. దినపత్రిక ప్రచురించిన వివరాలు నిజయో, కాదో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్తర కొరియాలో మరణశిక్షలపై దక్షిణకొరియా మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కాదు. గతంలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచురితమైన దాఖలాలున్నాయి.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/