కొత్త కోచ్‌ కోసం బిసిసిఐ ప్రకటన!

ప్రపంచకప్‌తో ముగిసిన రవిశాస్త్రి కాలపరిమితి

BCCI
BCCI

ముంబై: ఈ వరల్డ్‌కప్‌తో టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, ఇతర కోచింగ్‌ సిబ్బంది కాలపరిమితి ముగియడంతో కొత్త సిబ్బంది కోసం బిసిసిఐ ప్రకటన జారీచేసింది. ఈ సారి వయసుతో పాటు అనుభవం విషయాన్ని కూడా బోర్డు స్పష్టంగా పేర్కొంది. బిసిసిఐ కోచ్‌ల కోసం ప్రకటన ఇవ్వగానే హేమాహేమీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇంగ్లండ్‌ తొలిసారి కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆజట్టు కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ పేరు కూడా టీమిండియా కోచ్‌ రేసులో బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచవిజేతగా ఇంగ్లండ్‌ అవతరించడంతో బేలిస్‌ పేరు మార్మోగిపోతుంది. ఆస్ట్రేలియా జాతీయుడు టామ్‌ మూడీ కూడా కోచ్‌ బరిలో నిలిచాడు. గతంలో రవిశాస్త్రితో పోటీలో తృటిలో కోచ్‌ పదవిని మిస్సయ్యాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సుదీర్ఘంగా సేవలందిస్తుండడం మూడీకి అదనపు అర్హత.
భారత్‌కు విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా జాతీయ జట్టు కోచ్‌ రేసులో నిలిచాడు. శ్రీలంకకు చెందిన బ్యాటింగ్‌ దిగ్గజం మహేల జయవర్థనే పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న జయవర్ధనేకు అపారమైన క్రికెట్‌ పరిజ్ఞానం ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/