బీహార్‌లో కనిపిస్తున్న ఎవరెస్ట్‌ పర్వతం

బాగా తగ్గిన గాలి కాలుష్యం.. దశాబ్దాల తర్వాత కనిపిస్తున్న ఎవరెస్ట్‌ పర్వతం..ఆనందంలో ఆగ్రామ ప్రజలు

mount-everest -in-bihar

బీహార్‌: కరోనా లాక్‌డౌన్‌తో బీహార్‌లోని ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో బీహార్‌లో గాలి కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఈక్రమంలో అక్కడి ప్రజలకు ఎవరెస్ట్ శిఖరం స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్‌ ఉత్తరాన ఉండే… సింగ్‌వాహిని గ్రామం. అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉంటుంది. మరి అంత దూరంలో ఉన్న ఎవరెస్ట్ తమ కంటికి కనిపిస్తుందని ఆ ఊరి ప్రజలు ఏనాడూ అనుకోలేదు. కానీ… ఇప్పుడు కనిపిస్తోంది. అద్భుతమైన ఎవరెస్టును చూసి… ఫొటోలు తీసి… స్థానికులు ఎంతో ఆనందపడుతున్నారు. బీహార్‌లో కరోనా వైరస్ లేటుగా మొదలైంది. ఇప్పుడిప్పుడే కొత్త కేసులు జోరుగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 529 కేసులున్నాయి. మరణాలు నాలుగున్నాయి. అయినప్పటికీ… అక్కడి ప్రజలు లాక్‌డౌన్ బాగా పాటిస్తున్నారు. కాగా ఎప్పుడైతే పొల్యూషన్ తగ్గిందో… గాలిని కలుషితం చేసే కార్బొన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి రకరకాల ప్రమాదకర వాయువులు గాల్లో తగ్గిపోయాయి. అందువల్ల ఎప్పుడో దశాబ్దాల కిందట… తమ తాత ముత్తాతలు చూసిన ఎవరెస్ట్ పర్వతాన్ని అక్కడి ప్రజలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నారు. సింగ్‌వాహిని గ్రామ పంచాయతీకి చెందిన రీతూ జైస్వాల్… తమ ఊరి నుంచి తీసిన ఎవరెస్ట్ పర్వతం ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. మంచు తెరలు, చెట్లతో అద్భుతమైన ఎవరెస్ట్ శిఖరం అందులో కనిపిస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/