హైదరాబాద్‌లో నిఫా కలకలం

NIPAH VIRUS
NIPAH VIRUS

ఇద్దరు అనుమానితుల రక్త నమూనాల సేకరణ
నెగటివ్‌గా నిర్ధారణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వార్డుల ఏర్పాటు
ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు : డీఎంఈ రమేశ్‌రెడ్డి
హైదరాబాద్‌: కేరళ, కర్నాటక రాష్ట్రాలను వణికిస్తున్న నిపా వైరస్‌ హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. ఈ వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఇద్దరు వ్యక్తులు ఇక్కడి నిమ్స్‌, ఫీవర్‌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు వీరి రక్త నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ రిపోర్టులు నెగటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా నిపా బాధితుల కోసం రాజధానిలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌, నీలోఫర్‌ ఆసుపత్రులతో పాటు వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఎమర్జెన్సీ వార్డులు కూడా అందుబాటులో ఉంచారు. నిపా సోకితే మాటలు తడబడతాయనీ, ఊపిరి సమస్య, మెదడు వాపు వస్తుందనీ, ఈ వైరస్‌ సోకి వ్యాధి గ్రస్తులు దగ్గినా, తుమ్మినా, మూత్రం, చెమట, తెమడ ద్వారా వ్యాప్తి చెందుతాయని ఫీవర్‌ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నిపాకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన వైద్యం అంటూ ఏదీ లేదనీ, కేరళలో ఇప్పటి వరకు నిపా సోకి 10 మంది చనిపోగా, మరో 22 మందికి నిపా వ్యాధి లక్షణాలను గుర్తించామని పేర్కొన్నారు. సేకరించిన రక్త నమూనాల రిపోర్టు 48 గంటల తరువాత వస్తుందనీ, ఆ తరువాతే ఆ వ్యక్తులకు వైరస్‌ సోకిందీ లేనిది నిర్ధారిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు : డా.రమేశ్‌రెడ్డి
కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిపా వైరస్‌ కేసులు నమోదు కాలేదని వైద్యవిద్య సంచాలకులు డా.రమేశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఫీవర్‌ ఆసుపత్రికి ఒక వ్యక్తి రాగా అతని నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని ల్యాబ్‌కు పంపామన్నారు. అతడు ప్రస్తుతం ఈ వైరస్‌ అధికంగా వ్యాప్తిలో ఉన్న కేరళలోని కోజికోడ్‌కు వెళ్లలేదనీ, రాష్ట్రంలో ఎవరికీ నిపా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాలేదనీ, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.