ఘోర విమాన ప్రమాదం..19 మంది మృతి

దుబాయ్ నుంచి కోజికోడ్‌లో ల్యాండ్ అవుతూ ప్రమాదం

Kerala plane crash

కోజికోడ్‌: కేరళలోని కోజికోడ్‌లో ఉన్న కరీపూర్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడింది. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్‌, కోపైలట్‌ సహా 19 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించారు. వారిలో15 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 7.41 గంటలప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. దీనివల్లే రన్‌వేపై విమానం చక్రాలు జారి ఉంటాయని భావిస్తున్నారు. మల్లపురం, వయనాడ్‌ నుంచి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కరీపూర్‌ విమానాశ్రయం ఎత్తయిన ప్రాంతంలో ఉన్నది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/